కరువు నివారణకు రూ.150 కోట్ల ప్రణాళిక

WhatsApp Image 2026 10 24 at 7.08.08 PM

 

  • – మూడు మండలాల్లో శాశ్వత పరిష్కార చర్యలు
  • – మిడ్జిల్‌, ఉప్పునూతల, మక్తల్‌ మండలాల ఎంపిక
  • – ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి ప్రజాభిప్రాయాల సేకరణ
  • – నిధుల సద్వినియోగంపై ప్రత్యేక పర్యవేక్షణ
  • – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 24 (డిజైనర్ టెక్ గురు ప్రతినిధి): రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఎప్పుడు ఎదురైనా ప్రజలు, రైతులు వాటిని తట్టుకునేలా మూడు మండలాల్లో రూ.150 కోట్లతో శాశ్వత నివారణ చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, రైతు కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కరువు ప్రభావం చారిత్రకంగా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, వర్షాధార వ్యవసాయం అధికంగా ఉన్న జిల్లాలు, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు, రైతు కుటుంబాల జీవన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మండలాలను ఎంపిక చేసినట్లు వివరించారు. జాతీయ విపత్తుల నిర్వహణ నిధి సహకారంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మిడ్జిల్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ఉప్పునూతల, నారాయణపేట జిల్లాలోని మక్తల్‌ మండలాలను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, విపత్తుల నిర్వహణ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రాజెక్టు కార్యాచరణ, కరువు నిరోధక వ్యవసాయ విధానాల అమలు, నిధుల వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ పర్యవేక్షణలో వ్యవసాయ శాఖ ప్రధాన సమన్వయ సంస్థగా వ్యవహరించనుంది. ప్రాజెక్టు అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా గ్రామ, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.
ఎంపిక చేసిన ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో నీటి లభ్యత, సాగునీటి అవసరాలు, తాగునీటి సమస్యలు, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రాజెక్టు లక్ష్యాలు క్షేత్రస్థాయిలో నెరవేరుతాయని పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులకు సరిపోయే పనులను గుర్తించి, వాటికి ప్రాధాన్య క్రమం నిర్ణయించాలని తెలిపారు. మహిళలు, యువత, రైతులు, సంప్రదాయ కులవృత్తులపై ఆధారపడిన కుటుంబాల అవసరాలను కూడా ప్రణాళికల్లో భాగం చేయాలని ఆదేశించారు.
కరువు ప్రభావం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా గ్రామీణ ఉపాధి, కుటుంబ ఆదాయాలు, సంప్రదాయ వృత్తులపైనా ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. అందువల్ల నీటి వనరుల సంరక్షణతోపాటు ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను తగ్గించడం, అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవడం, గ్రామీణ కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఆదాయ అవకాశాలను మెరుగుపరచడం వంటి అంశాలను ప్రణాళికల్లో పరిశీలించాలని తెలిపారు. ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతోపాటు, భవిష్యత్తులో కరువు వచ్చినప్పుడు దాని ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యవస్థలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. నిధుల కేటాయింపు, పనుల ఎంపిక, అమలు, క్షేత్రస్థాయి ఫలితాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. కేవలం నిధులు ఖర్చు చేయడం లేదా పనులు పూర్తి చేయడమే కాకుండా, వాటి వల్ల ప్రజలకు ఎంత ప్రయోజనం కలిగింది, కరువు ప్రభావాన్ని తగ్గించడంలో ఎంత పురోగతి సాధించామనే అంశాలను కూడా అంచనా వేయాలని తెలిపారు. ఈ సమీక్షలో విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జ, వ్యవసాయ శాఖ కమిషనర్‌ సురేంద్రమోహన్‌, వ్యవసాయ శాఖ సంచాలకుడు ఎన్‌. గోపి తదితర అధికారులు పాల్గొన్నారు.