హైదరాబాద్ అక్టోబరు 21 (డిజైనర్ టెక్ గురు ప్రతినిధి): శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ‘బలగం’ చిత్రంతో విజయాన్ని అందుకున్న వేణు ఎల్దండి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
గ్రామీణ నేపథ్యంలో పల్లెటూరి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భక్తి, గ్రామీణ జీవనశైలి, పోరాటాలతో కూడిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా నటించడంతో పాటు ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా అందిస్తున్నారు.
దసరా పండుగ సందర్భంగా చిత్రబృందం విడుదల తేదీని అధికారికంగా వెల్లడించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘బలగం’ తర్వాత వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న సినిమా కావడం, దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా పరిచయం అవుతుండటంతో ‘ఎల్లమ్మ’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
‘ఎల్లమ్మ’ విడుదల తేదీ ఖరారు
